AGRICULTUREAMARAVATHI

రబీకి 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల

నెల్లూరు: జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం  నిర్వహించారు.అనంతరం పలువురు రైతు సంఘాల నాయకులు, రైతులు మాట్లాడుతూ రెండో పంటకు విత్తనాలను ఇబ్బందులు లేకుండా అందించాలని, టార్పాలిన్ పట్టాలను సబ్సిడీపై అందజేయాలని, పంట కాలువలకు  పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండో పంటకు పుష్కలంగా నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, రెండు రిజర్వాయర్లలో కూడా నీరు అందుబాటులో ఉందని చెప్పారు. రైతులందరూ తక్కువ నీటి వినియోగంతో పండే చిరుధాన్యాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని, రైతులందరూ కూడా చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎక్కువగా వరి వేయకుండా చిరుధాన్యాలు, పత్తి, వేరుశనగ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన వాకాటి నారాయణరెడ్డి పదవీ కాలం  ముగియడంతో ఆయనను మంత్రి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

 చివరిగా రైతులకు ఓదెలు (చిరుధాన్యాలు) విత్తనాలను మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాఖ రూపొందించిన వ్యవసాయ, అనుబంధ శాఖల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక 2023-24 పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు,రైతు సంఘాల నాయకులు, రైతులు, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *