సముద్ర జీవుల సంరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: సముద్ర జీవుల సంరక్షణకు తద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు స్వచ్ఛ సాగర్-సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ కమాండెంట్ అభిక్ చక్రబర్తి ల నేతృత్వంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది, వివిధ పాఠశాల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు దాదాపు 500 మంది కృష్ణపట్నం సముద్ర తీరంలో వ్యర్ధాలను ఏరివేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ సాగర్-సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని 7500 కిలోమీటర్ల భారతదేశ తీర ప్రాంతంలో ఉన్నటువంటి 75 బీచ్ లలో 75 రోజులపాటు సముద్ర తీరాల పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గుదల, సముద్రంలో పడవేసే వ్యర్ధాలను వెలికితీసి, సముద్రజలాలను శుభ్రం చేసి, రేపటి భవిష్యత్తుకు స్థిరమైన జీవన విధానం కోసం ఉద్దేశించిన కార్యక్రమమన్నారు. పర్యావరణం పట్ల ప్రజలందరికీ అవగాహన, సామాజిక స్పృహ ఉండాలన్నారు.ఈ కార్య క్రమంలో ఆపరేషనల్ ఓషన్ సర్వీస్ సైంటిస్ట్ నాగరాజు కుమార్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు, పర్యావరణ సంయోజక్ చంద్రశేఖర్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోలయ్య, తాహసిల్దార్ మనోహర్ బాబు, ఎంపీడీవో ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.