మనం-మన గ్రంథాలయం పేరిట గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు-మంత్రి

నెల్లూరు: గ్రంధాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం-మన గ్రంథాలయం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు రేబాలవారి వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన మనం-మన గ్రంథాలయం కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేషగిరి రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో గ్రంధాలయ సంస్థలను కేవలం పదవులు భర్తీ చేసేందుకు వాడుకున్నారని, ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని వారిని చైర్మన్లుగా నియమించడంతో గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గంధాలయాల పటిష్టత పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ క్రమంలోనే మనం- మన గ్రంథాలయం పేరిట గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గ్రంథాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు జిల్లాకు కోటి రూపాయలను సీఎం మంజూరు చేయగా, గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లు ఆయా గ్రంధ పాలకులకు అందజేసినట్లు చెప్పారు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గ్రంథాలయాల ఆవశ్యకతను గుర్తించి, వాటి అభివృద్ధికి సహకరించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధికి చేపడుతున్న అనేక కార్యక్రమాలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద, పాఠకులు,తదితరులు పాల్గొన్నారు.