అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడుకి వైభవంగా పుష్పయాగం

తిరుమల: కలియుగ దైవం..అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు…తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది.ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహించారు.సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమించారు.
టన్నుల కొద్ది పుష్పాలు:- పుష్ప యాగం కోసం వివిధ రాష్ట్రాల నుంచి 27 రకాల పుష్పలను సేకరించారు. ఈ పుష్ప యాగానికి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడునుంచి టన్నుల కొద్ది పుష్పాలను టీటీడీ అధికారులు సేకరించారు.ఇందులో సంపంగి, కనకాంబరం, లిల్లీ, తామరపువ్వులు, విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, రక రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి అగ్రకర్ణికా, కాలనందా అనేవి మొత్తం ఇరవై ఏడు రకాలు పువ్వులతో వెంకటేశ్వరస్వామికి పుష్పకైంకర్యం చేశారు.