ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరులో పేర్లు నమోదు చేసుకోవాలి-కలెక్టర్

నెల్లూరు: స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మనాధ్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అంతకుమునుపు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి స్పందన అర్జీల పరిష్కారం, ముఖ హాజరు, కోర్టు కేసుల పరిష్కారం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు జారీ చేశారు.
జిల్లాలో ముఖ హాజరుకు సంబంధించి ఇంకా చాలా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి పేర్లను నమోదు చేసుకోలేదని, కొందరు నమోదు చేసుకున్నసరిగా వినియోగించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరులో పేర్లు నమోదు చేయడంతో సహా ప్రతిరోజు నూటికి నూరు శాతం ముఖ హాజరు అయ్యేలాగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో 1644 కోర్టు రిట్ పిటిషన్లు, 307 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రధానంగా జలవనుల శాఖలో 186 పంచాయతీరాజ్ శాఖలో 41 కేసులు అత్యధికంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కోర్టు కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోర్టుదికరణ కేసులకు వెంటనే కౌంటర్ ఆఫిడవిట్లు దాఖలు చేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కావలి రానున్నారని, ఆరోజున చుక్కల భూములు, రీ సర్వే కార్యక్రమం సంబంధించి ప్రత్యేక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో చేపట్టవలసిన పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి మంజూరు కోసం ఈ సోమవారమే ఉన్నతాధికారులకు పంపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.