నాబార్డు ద్వారా మంజూరైన అన్ని పనులను త్వరితగతిన మొదలుపెట్టాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో నాబార్డ్ సహకారంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నాబార్డు నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాబార్డ్ నిధులతో చేపడుతున్న వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి, విడుదలైన నిధుల వివరాలను నాబార్డు డిడిఎం రవి సింగ్ కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి నాబార్డు నిధులు ఎంతో ఉపయోగపడతాయని, అధికారులందరూ నాబార్డు ద్వారా మంజూరైన అన్ని పనులను త్వరితగతిన మొదలుపెట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులకు సంబంధించి బిల్లులను త్వరగా అప్లోడ్ చేయాలని సూచించారు. ముఖ్యంగా సమగ్ర శిక్ష, గ్రామీణ నీటిపారుదల, ఐ సి డి ఎస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, మెడికల్, డ్వామా శాఖల అధికారులు నాబార్డ్ సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.