గ్రామస్తులను హడలేత్తిస్తున్నచీమల దండు

అమరావతి: తమిళనాడులోని కరంతమలై రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల 7 గ్రామాల్లో ‘ఎల్లో క్రేజీ యాంట్స్’ అనే చీమల దండులు బీభత్సం సృష్టిస్తున్నాయి.సన్నగా, కొద్దిపాటి పసుపు రంగు వున్నఈ చీమలు చాలా వేగంగా కదులుతాయి. ఈ చీమల దాటికి తట్టుకోలేక ప్రజలు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోతున్నారు.ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయని ప్రభుత్వ వెటర్నీ డాక్టరు సింగముత్తు మీడియాకు తెలిపారు.ఈ ప్రాంతాల్లో చాలా వరకు వ్యవసాయం, పశువుల పెంపకంను జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ చీమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అడవి దగ్గరికి వెళ్లగానే చీమలు మనపైకి ఎక్కిచికాకు పరుస్తాయని, వీటి కారణంగా చర్మంపై పొక్కులు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అవి ఒక్కసారిగా గుంపులుగా వస్తుండటంతో తాగేందుకు నీళ్లు కూడా తీసుకెళ్లలేక పోతున్నామని, ఏం చేయాలో తోచడం లేదని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా అడవిలో ఈ చీమలు చూస్తున్నామని, జనజీవనాన్ని అస్తవ్యస్తంచేస్తూ గ్రామాల్లో ఇంత పెద్ద సంఖ్యలో కనిపించడం ఇదే తొలిసారని స్థానికులు అంటున్నారు. కొందరు గ్రామస్తులు చీమల గుంపు దాడిని తట్టుకోలేక గ్రామాల్లోని ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మరోవైపు చీమలు దాడి చేయడం వల్ల పశువులతో పాటు పాములు, కుందేళ్లు కూడా చనిపోతున్నాయి.ఈ చీమలు కుట్టవు, కరవవు అయితే అవి విడుదలచేసే ఫార్మిక్ యాసిడ్ జంతువుల కళ్లను ప్రభావితం చేసి ఉండవచ్చని డాక్టరు సింగముత్తు పేర్కొన్నారు. ఫార్మిక్ యాసిడ్ పడినచోట దురద, చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయివాతవరణంలో మార్పులతో విపరీతమై వేడి కారణంగా ఇవి ఎక్కవగా ఆహారం తీసుకోవాల్సి వుంటుందని,ఇలాంటి సమయాల్లో చీమలు,ఇతర విషపురుగులు ఆరుబయట ప్రాంతాల్లో వస్తాయని తెలిపారు.ఈ విషయంపై కీటక శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు నమూనాల్ని సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు వాటి నైజాన్ని పరిశీలిస్తున్నారు.