రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో ముందడుగు-సీ.ఎం జగన్

నెల్లూరు: ఈరోజు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు వేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్‌కో స్వయంగా నిర్మించిన శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల ప్లాంటును ఈ రోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నాను అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.గురువారం ప్రత్యేక హెలీకాప్టర్ లో ముత్తుకూరుకు చేరుకున్న సీ.ఎం APPDCL IIIయూనిట్ ను ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు రూ.3200 కోట్లు యుద్ధప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశామన్నారు.రాష్ట్ర విద్యుత్ అవసరాలలో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్ సంస్ధలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకి 19 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఏపీ గ్రిడ్‌కు ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుందని చెప్పారు.ఈకార్యక్రమంలో మంత్రులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.