ఈనెల 20 నుంచి 23వ తేదీల మధ్య జిల్లాకు మరో తుఫాన్ హెచ్చరిక-కలెక్టర్

నెల్లూరు: ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీల మధ్యలో జిల్లాకు మరో తుఫాన్ హెచ్చరిక ఉన్నందున ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మనుబోలు మండల పరిధిలోని గురివిందపూడి, కాగితాలపూరు గ్రామ సచివాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవసరమైన మందులను అందించాలన్నారు. జిల్లాకు మరో తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులను, పశువుల యజమానులను అప్రమత్తం చేయాలన్నారు.కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీరాజ్ ఎస్ ఈ అశోక్ కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సుధీర్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.