ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ-కమీషనర్ హరిత

నెల్లూరు: నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్న నేపధ్యంలో, అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి హరిత, ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కర్నల్ ఎస్. కోహ్లి తో కలసి శనివారం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు, అదేశాలిచ్చారు.ఈ సందర్భంగా నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి హరిత మాట్లాడుతూ, ఈ నెల 12 రోజుల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నెల్లూరు ఏ సి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతుందని, ఈ ర్యాలీకి సుమారు 38 వేల మంది అభ్యర్ధులు ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, రోజుకు 3 వేల మంది వంతున ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకు హాజరౌతారని తెలిపారు. అందుకనుగుణంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారుల సూచనల మేరకు బ్యారీకేడింగ్, లైటింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, పోలీసు బంధోబస్తు, శానిటేషన్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు తదితర విధులను సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా చేపట్టాలని కమీషనర్, అధికారులకు సూచించారు.