టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సహకరించండి-కమిషనర్ జాహ్నవి

నెల్లూరు: నగరంలోని వేంకటేశ్వరపురం, అల్లీపురం, కొండ్లపుడి, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాలను స్వాధీనం చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సహకరించాలని లబ్ధిదారులకు కమిషనర్ సూచించారు. టిడ్కో గృహాల లబ్ధిదారులతో సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నిప్రాంతాల్లో 80 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని టిడ్కో గృహాలు మరో 3 నెలల్లో లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఆర్ధిక వెసులుబాటు కల్పించే దిశగా సింగిల్, డబల్ బెడ్ రూమ్ గృహాలకు గతంలో ప్రతిపాదించిన విలువ మొత్తాన్ని ప్రస్తుతం సగానికి తగ్గించారని తెలిపారు. బ్యాంకు రుణంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను కలుపుకుంటే లబ్ధిదారులపై తీవ్రమైన ఆర్ధిక భారం ఉండబోదని కమిషనర్ స్పష్టం చేసారు.సింగల్, డబల్ బెడ్ రూమ్ గృహాలకు ముందుగా ఎక్కువ మొత్తాలను లబ్ధిదారుని వాటాగా చెల్లించినవారికి, గృహాలను స్వాధీనం చేసే సమయంలో ఆయా మిగులు మొత్తాలను తిరిగి చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు. 60 ఏళ్ళు పైబడిన వారికి, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వారికి బ్యాంకు రుణాలు మంజూరు కావు కాబట్టి నాలుగు విడతల్లో మొత్తం విలువను కార్పొరేషన్ కు చెల్లించేలా లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని గృహాలను స్వాధీనం పొందగలరని కోరారు.. గతంలో గృహాలు మంజూరు అయినప్పటికీ ప్రస్తుతం అవసరం లేదు అనుకునే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి రద్దు చేసుకోవచ్చు అని, అయితే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా గృహాల లబ్ధిదారులుగా వారు అనర్హులుగా గుర్తింపబడుతారని కమిషనర్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సందేహాలను కమిషనర్ నివృత్తి చేసి, బ్యాంకు రుణాల మంజూరుపై వారికి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డి.సి.ఓ రామ సుబ్బారావు, ఇతర హౌసింగ్ కార్పొరేషన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.