డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రజలందరూ డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి, సైబర్ నేరగాళ్ల మోసాల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లాకలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని జి పి ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు డిస్టిక్ లీడ్ కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు, అంతర్గత ఫిర్యాదుల పరిష్కారంపై జాతీయ సమగ్ర అవగాహన సదస్సును హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిర్వహించింది. ఈ అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ విజయరావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలామంది వినియోగదారులు ఇంకా పాత పద్ధతులను వాడుతున్నారని, భయాలు, అపోహలు వీడి బ్యాంకింగ్ సేవల్లో వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.ప్రభుత్వం కూడా అనేక రకాల సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బ్యాంకు ఖాతాలోని జమ చేస్తుందని, ప్రజలందరూ ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన కలిగి సులభతర బ్యాంకింగ్ సేవలు అలవాటు చేసుకోవాలన్నారు.అనంతరం ఎస్పీ, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి జరుగుతున్న ఆన్లైన్ మోసాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా తెలిపి, ప్రజలు మోసాలబారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు..తొలుత డిస్టిక్ లీడ్ బ్యాంకు మేనేజర్ టంగుటూరి శ్రీకాంత్ ప్రదీప్ మాట్లాడుతూ బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఆర్.బి.ఐ సూచనల మేరకు అవగాహన సదస్సులు చేపడుతున్నట్లు చెప్పారు. బ్యాంకు లావాదేవీల పై ఏదైనా సమస్యలు ఉంటే బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయాలని, అన్ని రకాల బ్యాంకింగ్ సమస్యలకు వన్ నేషన్- వన్ అంబుడ్స్ మాన్ నినాదంతో ఒకే పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.