DISTRICTS

బ్యాంకర్లు ఆధార్ నగదు మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి-కలెక్టర్

అభివృద్ధి బ్యాంక్ లింకేజీ రుణాలు..

నెల్లూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో ప్రైవేటు బ్యాంకులు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు  సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం నిర్వహించారు. ముందుగా బ్యాంకింగ్ కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ వివరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో ఉందని, రానున్న రోజుల్లో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు జిల్లాలో మొదలు కానున్నాయని, వీటికి సంబంధించి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.

ఆధార్ మోసాలను అరికట్టండి:- ఆధార్ బయోమెట్రిక్ ద్వారా నగదును బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు తెలియకుండా హ్యాకర్లు  తమ ఖాతాలను మళ్లించుకుంటున్నారని, ఈ విషయమై బ్యాంకర్లు ఆధార్ నగదు మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు ఈ మోసాలకు గురి కాకుండా, ఎక్కడపడితే అక్కడ ఆధార్ బయోమెట్రిక్ వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ భద్రతకు సంబంధించి ఎం ఆధార్ యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేలా, ఈ మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండేలా బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మోసాలు మళ్లీ మళ్లీ జరగకుండా బ్యాంకర్లు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలు నష్టపోకుండా చర్యలు చూడాలన్నారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్, ఆర్బిఐ ఏజీఎం ఆర్ కె హనుమ కుమారి, కెనరా బ్యాంక్ ఆర్ఎం శ్రీనివాస కన్నన్, నాబార్డు డి డి ఎం  రవిసింగ్, డి ఆర్ డి ఎ, మెప్మా పీడీలు సాంబశివా రెడ్డి, రవీంద్ర, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ జె డి లు నాగేశ్వర రావు,మహేశ్వరుడు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు,  బ్యాంకర్లు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *