హైదరాబాద్: గోషామహాల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓంపాఠక్ స్పష్టం చేశారు..రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మునావర్ షోను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు.తాను వ్యతిరేకించినా.. షో నిర్వహించారని యూట్యూబ్ లో రాజాసింగ్ వీడియో విడుదల చేశాడు.అయితే ఈ వీడియోలోని వ్యాఖ్యలు ముస్లిం వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులతో కేసులు నమోదవుతున్నాయి.ఈ విషయంను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం రాజాసింగ్ పై చర్యలు తీసుకుంటూ, పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఎమ్మెల్యే రాజాసింగ్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో సోమవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు మంగళవారం ఉదయమే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.