ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం-నవంబర్ 3న పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగిసింది.నేడు చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా విస్తృతంగా ప్రచారం చేశాయి. నవంబర్ 3వ తేది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.మునుగోడు బై పోల్ బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. నవంబర్ 6వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి.
2లక్షల 41వేల 855 మంది ఓటర్లు:- మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లున్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5 వేల 685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఇప్పటివరకు 739 మంది ధరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ మూడంచెల భద్రత అరెంజ్ చేశారు. ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 వేల 366 పోలీస్ సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.