రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం

అమరావతి: రైతులపై ఎరువుల భారం పడకుండా 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో ఎరువుల పై రాయితీని కేంద్రమంత్రిమండలి ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించడంతో, రబీ సీజన్ లో దాదాపు రూ.51,875 కోట్ల రూపాయల రాయితీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నత్రజని (N), భాస్వరం (P), పొటాష్ (K), సల్ఫర్ (S) వంటి ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ (NBS) కోసం కేంద్ర ఎరువుల శాఖ ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడంలో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రైతులు లబ్ధి పొందనున్నారు.2022-2023 రబీ సీజన్ కు గానూ అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల వద్ద రాయితీతో కూడిన ఎరువులు లభించనున్నాయి. రష్యా,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా,ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.అయితే ప్రధాని మోదీ,భారత్ కు ఎరువుల సరఫరా పెంచాలని చేసిన విజ్ఞప్తికి, రష్యా అధ్యక్షడు పుతిన్ సానూకూలంగా స్పందించడంతో,భారతదేశంలోని రైతులకు సరిపడినంత ఎరువులను కేంద్రం అందిచనున్నది.