హైదరాబాద్: TRS పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బయటకు వచ్చిన వీడియోలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో స్పందించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ లోని ఫాంహౌస్ కు వచ్చిన వారు BJP నేతలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడి ఫాంహస్ వాళ్లదేనని, అలాగే, ఫిర్యాదు చేసింది కూడా వాళ్లేనని చెప్పారు. డ్రామాలు ఆడడం TRSకు కొత్తేమీ కాదని, గతంలో ఓ మంత్రిపై హత్యాయత్నం జరిగిందని,అది కూడా నాటకమే అన్న విషయం బయటపడిందన్నారు.ఎమ్మెల్యేలను కొనేందుకు స్వామీజీలు వెళతారా? అంటూ నిలదీశారు. తెలంగాణ CM KCRకు హిందూ ధర్మం అంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.
కుట్రలు పన్ని తమపై బురద చల్లడానికే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన సంజయ్, TRSకు చెందిన ఆ నలుగురు MLAలను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా, వారిని ప్రగతిభవన్‌కు ఎలా రమ్మంటారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఎమ్మెల్యేలను 50 పైసలకు కూడా ఎవరూ కొనరంటూ ఎద్దేవా చేశారు.TRS ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్టున్నట్లు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంపై కేసిఆర్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని… బీజేపీపై అకారణంగా బురద చల్లేందుకు ప్రయత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో కేసీఆర్ వేసిన ఇలాంటి చిల్లర డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.