అమరావతి: చైనాకు చెందిన ఓ మహిళ పేరు మార్చుకుని నకిలి గుర్తింపు కార్డులతో బౌద్ధ సన్యాసిని వేషంలో తిరుగుతుండగా ఈమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లీష్, నేపాలి, చైనీస్ భాషల్లో ఆనర్గళంగా మాట్లాడే ఈమె, చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన ‘కై రువో’ అనే మహిళగా తేలింది.సదరు మహిళ బౌద్ధ సన్యాసిని ముసుగులో’డాల్మా లామా’గా పేరు మార్చుకుని ఢిల్లీలో నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ యూనివర్సీటీ నార్త్ గేట్ వైపు వున్న టిటెటన్ శరణార్ధుల కాలనీ అయిన మజ్నుకా తిలాలో బౌద్ధ సన్యాసిని వేషధారణలో ఉన్న ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈమె నుంచి డోల్మా లామా పేరుతో వున్న నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్స్ రీజినల్ రిజస్ట్రేషన్ కార్యాలయంలో ఆమె గురించి విచారించడంతో సదరు మహిళ చైనా పౌరురాలిగా నిర్ధారణ అయ్యింది. చైనా చెందిన ఆమె నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలతో 2019 నుంచి భారత్ లోనే ఉండడంతో,ఆమె చైనా గూఢాచారి అనే పలు అనుమానాలు రేకెత్తున్న క్రమంలో ఆమెను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమెపై ఐపీసీ 120బి(నేర పూరిత కుట్ర)419 (వ్యక్తిగతంగా మోసం చేయటం)420 (చీటింగ్),467 సెక్యూరిటీ ఫోర్జరీ చేయటం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె గుర్తింపు కార్డులో నేపాల్ రాజధాని ఖట్మండు అడ్రస్ ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను విచారిస్తున్న సమయంలో తనను చైనా కమ్యూనిస్టు పార్టీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని,అందుకే ఇలా ఇక్కడ తలదాచుకున్నానని చెబుతోందని, అయితే అమె చెప్పే కారణాలు నమ్మదగినట్లుగా లేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.