ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న కలెక్టర్ చక్రధర్

నెల్లూరు: మత్స్య, ఆక్వా సాగు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అందుకున్నారు. సోమవారం డామన్ లోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ కార్యదర్శి జితేంద్రనాథ్ స్విన్ చేతుల మీదుగా ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని కలెక్టర్ అందుకున్నారు. ఈ పురస్కారం కింద మూడు లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేసి జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర బాబును ఘనంగా సత్కరించారు. 2021-22 సంవత్సరానికి గాను మత్స్య సంపద ఉత్పత్తి, వ్యవస్థీకృత సమగ్ర అభివృద్ధి, రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పునరుత్పత్తి, ఆక్వా, మెరైన్ కల్చర్లలో సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రొయ్యలు, చేపల సాగు, ఫిష్ లాండరింగ్, డ్రెస్సింగ్ సెంటర్ల నిర్మాణము, మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము మొదలైన అంశాలలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లాకు ఈ అరుదైన పురస్కారం లభించింది.కలెక్టర్ వెంట మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ ఉన్నారు.