సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటాం-కలెక్టర్

నెల్లూరు: స్పందన విజ్ఞప్తులను పరిష్కరించకుండా మొక్కుబడిగా పరిశీలించి మూసివేస్తున్న సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు.శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అరుణమ్మ వీధి సచివాలయం, బాలాజీ నగర్ సచివాలయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన కార్యక్రమం విధిగా నిర్వహించాలన్నారు. ఆయా విజ్ఞప్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. కేవలం మొక్కుబడిగా సమస్యను పరిష్కరించినట్లుగా చూపి, ఆయా దరఖాస్తులను మూసివేయడం తగదన్నారు. ఒకే సమస్య మరల మరల స్పందనలో వస్తుందంటే సదరు సమస్యను సక్రమంగా పరిష్కరించలేదని అర్థమన్నారు. స్పందనలో వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి సమస్య మూలాల్లోకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.