ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలి-కలెక్టర్

నెల్లూరు: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చేపట్టిన జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 12.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించామని, ఈ మేరకు ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలోని 9 నర్సరీలో అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్తీకమాసంలో దేవత వృక్షాలను నాటడం ఆనవాయితీ అని, ఆ మేరకు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా మొక్కలు నాటడం తమ బాధ్యతగా భావించాలన్నారు.