DISTRICTS

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి-మంత్రి కాకాణి

నెల్లూరు: రహదారి భద్రత అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, మేయర్ శ్రీమతి స్రవంతి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, రోడ్డుపై అవసరమైన చోట ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రాణ నష్టం జరగకుండా 108, 104 సేవలు అందుబాటులో ఉంచిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా రోడ్డు  భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ,  తమను తాము మార్చుకోవాలని, అప్పుడే మార్పు కనిపిస్తుందన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో అధికారులు గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరిలో స్వచ్ఛందంగా మార్పు రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ప్రతినిత్యం వాహనాల్లో ప్రయాణించేవారు నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణ తమ వంతు బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం వల్ల అనేక ప్రమాదాలు జరిగి, ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని ఆమె సూచించారు. తొలుత రోడ్డు భద్రతా వారోత్సవాల్లో చేపట్టిన కార్యక్రమాలను, జిల్లాలో రోడ్డు ప్రమాదాల వివరాలను, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను ఉప రవాణా కమిషనర్ చందర్ క్లుప్తంగా వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *