యూజర్ చార్జీల వసూళ్లు వేగవంతం చేయండి-కమిషనర్

నెల్లూరు: నగరంలో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న నూతన వాహనాల రుణ బకాయీల చెల్లింపులకు యూజర్ చార్జీల వసూళ్లు తప్పనిసరి అని, అన్ని డివిజనుల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత శానిటేషన్ విభాగం సిబ్బందిని ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా (CLAP) యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ నిర్వహించారు. సమీక్షలో భాగంగా సచివాలయాల వారీగా శానిటరీ సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్ లు, సెక్రెటరీల విధివిధానాలను అడిగి తెలుసుకుని, వారు తెలిపిన గణాంకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్ విధులపట్ల సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమీక్షలో కమిషనర్ కు అధికారులు అందించిన నివేదికలో శానిటరీ విభాగంలోని మొత్తం 1505 పారిశుద్ధ్య సిబ్బందిలో 238 మంది శాశ్వత, 1267 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని, వారంతా రెండు షిఫ్టులలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ లైసెన్స్, కరెంటు కనెక్షన్లు, కమర్షియల్ భవనాల పూర్తి వివరాలను రూపొందించి పన్ను వసూళ్లు పెరిగేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్, శానిటరీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.