అమరావతి: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECE) ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని మంగళవారం లేఖ రాసింది. దీనిపై తమకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరింది. అలాగే పార్టీలకు ఉన్న ఆర్థిక వనరులేంటి ? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ? అనేది కూడా పేర్కొన్నాలని నిర్దేశించింది. ఈ అంశాలపై ఈనెల 19 లోగా సమాధానం ఇవ్వలని రాజకీయ పార్టీలకు కోరింది.ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత హామీలను ‘టైమ్ బాంబులు’గా అభివర్ణించింది. ‘ఉచిత’ పథకాల ఖర్చు పరిమితిని సుప్రీంకోర్టు ప్యానెల్ ద్వారా నియంత్రించాల్సిందిగా సూచించింది. రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాల ఖర్చు ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 1 శాతం లేదా పన్ను ఆదాయంలో 1 శాతాన్ని మించకుండా చూడాలని అభిప్రాయపడింది. ఎస్‌బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్,,వివిధ రాష్ట్రాలు అందిస్తున్న ఉచితాలపై ఈ నివేదికను రూపొందించారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని నివేదికలో ప్రస్తావించారు. కార్పొరేషన్ అప్పుల్లో,, పలు రాష్ట్రాల ఆప్-బడ్జెట్ బారోయింగ్స్ అంటే కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించే బడ్జెటేతర అప్పుల భారం కూడా భారీగా పెరుగుతోందని తెలిపారు.2022 GDPలో ఆ అప్పుల మొత్తం 4.5 శాతంగా ఉందని ఘోష్ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అప్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో బడ్జెటేతర అప్పుల భారం 11.7 శాతంగా ఉందన్నారు. తెలంగాణ తరువాత స్థానాల్లో సిక్కిం (10.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (9.8 శాతం), రాజస్థాన్ (7.1 శాతం), ఉత్తరప్రదేశ్ (6.3 శాతం) ఉన్నాయని వెల్లడించారు.