ఆస్తి,కొళాయి,ఖాళీ స్థలం పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి-కమిషనర్ హరిత

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఈనెల 31 వ తేదీ లోపు అన్ని రకాల పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో మంగళవారం ఉదయం నిర్వహించారు. సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను, కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేసి ఉన్నత ఫలితాలను సాధించాలని సూచించారు.ఇప్పటివరకు పన్నులు జారీ చేయని వారిని గుర్తించి వెంటనే సంబంధిత పన్ను నోటీసులను జారీ చేసి వసూళ్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. వివిధ విభాగాలలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను నిర్దిష్ట కాలంలో లోపు పరిష్కరించాలని, గడువు దాటితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం అడ్మిన్ కార్యదర్శుల పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్లంతా పర్యవేక్షించాలని, సచివాలయం విధి నిర్వహణ సమయంలో ప్రతి ఒక్క కార్యదర్శి కార్యాలయంలోనే ఉండేలా తనిఖీలు నిర్వహించాలని రెవెన్యూ అధికారులను సూచించారు.సచివాలయ కార్యదర్శులు అంతా క్రమం తప్పకుండా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ను ధరించేలా స్పెషల్ ఆఫీసర్లు సచివాలయాలను తరచుగా తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.