ఫిషింగ్ హార్బర్ లో పటిష్టమైన జెట్టి నిర్మాణాలపై దృష్టి పెట్టాలి-కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రెటరీ

నెల్లూరు: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మోడల్ హార్బర్ గా తీర్చిదిద్ది 2023 జనవరిలోగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రెటరీ బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం బొగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిషింగ్ హార్బర్ ను అభివృద్ధి చేస్తున్న ఏపీ మారటైం బోర్డు సీఈవో షణ్ముగం ఫిషింగ్ హార్బర్ లో చేపడుతున్న పనుల వివరాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అధికారులకు వివరించారు. జాయింట్ సెక్రెటరీ బాలాజీ అధికారులతో కలిసి ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా బాలాజీ అధికారులతో మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థికంగా ఉపయోగపడేలా అన్నీ అత్యాధునిక వసతులతో సమీకృత హార్బర్ గా ఫిషింగ్ హార్బర్ ను తీర్చిదిద్దాలని సూచించారు. మత్స్య సంపద ప్రాసెసింగ్ యూనిట్లు, శీతలీకరించిన మార్కెటింగ్ హాళ్లు, బోట్లు నిలిచేందుకు పటిష్టమైన జెట్టి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మత్స్య సంపద ఎగుమతులు, సులభతరమైన మార్కెటింగ్ సౌకర్యాలకు అనువుగా ఉండి స్థానిక మత్స్యకారులకు లాభం చేకూరేలా ప్రణాళికాబద్ధంగా హార్బర్ ను నిర్మించాలని సూచించారు. ఈ పర్యటనలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు, ఆర్డిఓ శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు.