అమరావతి: బీసీసీఐ కొత్త అధ్యక్షునిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎన్నికయ్యాడు.ముంబైలోని తాజ్ హోటల్ జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులంతా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీని బీసీసీఐ కొత్త అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. బీసీసీఐకి రోజర్ బిన్నీ 36వ అధ్యక్షుడు.అధ్యక్షుడితో పాటు ఏజీఎంలో బోర్డు నూతన కార్యవర్గం ఎంపికైంది. బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం పదవీకాలం ముగియటంతో, బోర్డుకు అనుబంధంగా ఉన్న 30కి పైగా క్రికెట్ సంఘాల ప్రతినిధులు సరికొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకూ బోర్డు కోశాధికారిగా వ్యవహరించిన అరుణ్ ధుమాల్,,ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ముంబై క్రికెట్ సంఘం ప్రతినిధి అశీష్ షెలార్ బీసీసీఐ సరికొత్త కోశాధికారి బాధ్యతలు చేపడతారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎంపికయ్యారు. బీసీసీఐ సెక్రటరీగా జైషా కొనసాగనున్నారు.