రేపటి నుంచే కాపు రిజర్వేషన్ల సాధనకై నిరాహార దీక్ష-మాజీ ఎంపీ హరిరామజోగయ్య

అమరావతి: జగన్‌రెడ్డి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామజోగయ్య అల్టిమేటం జారీ చేశారు. సోమవారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కాపు రిజర్వేషన్ల సాధనకై ప్రాణాలు ఇచ్చేందుకు అయిన సిద్ధమని,,రేపు పాలకొల్లులోని గాంధీ సెంటర్‌లో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. దీక్షకు అనుమతి కోరినా పోలీసులు ఇవ్వలేదని, దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించినా దీక్షను కొనసాగిస్తానని హరిరామజోగయ్య స్పష్టం చేశారు. కాపులపై ముఖ్యమంత్రి జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని, కాపులు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు. కేంద్రం, అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో ప్రయత్నించారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి జగన్ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదన్నారు. మూడు సంవత్సరాల్లో జగన్ కాపులకు అన్యాయం చేశారని హరిరామజోగయ్య మండిపడ్డారు.