పట్టభద్రులు, ఉపాధ్యాయులు నవంబర్ 7లోగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని పట్టభద్రులు, ఉపాధ్యాయులందరూ నవంబర్ 7వ తేది లోగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈనెల 1న భారత ఎన్నికల సంఘం విడుదల చేసిందని, పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొనుటకు సదరు ఉపాధ్యాయులు, పట్టభద్రులు జిల్లాలో సాధారణ నివాసి అయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొనుటకు 2019 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తయిన వారందరూ అర్హులన్నారు. టీచర్లకు సంబంధించి 2016 నవంబర్ 1 నుండి 2022 అక్టోబర్ 31 వరకు ఆరు సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలం పనిచేసిన అసిస్టెంట్ పోస్టుకు సమాన విద్యార్హతలు కలిగి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులందరూ టీచరు ఓటు నమోదుకు అర్హులన్నారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులందరూ నవంబర్ 7 లోగా పట్టభద్రులైతే ఫారం-18, టీచర్లయితే ఫారం-19 పూర్తి చేసి సమీప తాసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ కార్యాలయాల్లో గాని, డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. సీఈఓ ఆంధ్ర. ఎన్ఐసి. ఇన్ అనే వెబ్ సైట్ లో గాని నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని అబ్జెక్షన్ లు, క్లెయిమ్ లు పరిశీలించిన తదుపరి డిసెంబర్ 30న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. అర్హులైన పట్టభద్రులు, టీచర్లు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.