కస్తూర్బా బాలికల విద్యాలయం ఆవరణంలో చేనేత ఎగ్జిబిషన్-కలెక్టర్

నేతన్నలను ప్రోత్సహించాలి..
నెల్లూరు: నగరంలోని కస్తూరిదేవి బాలికల విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను జిల్లా ప్రజలందరూ సందర్శించి, విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కళాకారుల వృత్తి, నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ చక్రధర్ బాబు కోరారు..ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్)లో నాబార్డు సహకారంతో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయ దుకాణాలను కలెక్టర్ ప్రారంభించారు..ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 30 చేనేత వస్త్రాల విక్రయ స్టాళ్లతో కస్తూరి దేవి బాలికల విద్యాలయంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి పేరెన్నికగల కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారన్నారు. ప్రాచీన కళలు మరుగున పడిపోకుండా, చేనేత కార్మికులకు అండగా, వారి శ్రమకు గుర్తింపు, గౌరవం ఇస్తూ ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలను ప్రజలందరూ కొనుగోలు చేయాలని కోరారు.సుమారు 300 గంటలపాటు మగ్గం మీద కార్మికుడు శ్రమిస్తే ఒక చీర తయారవుతుందని, అదే పవర్ హ్యాండ్లూమ్స్ మిషన్ల ద్వారా మూడు నిమిషాల్లో తయారయ్యే చీర ఎక్కువ కాలం మన్నిక ఉండదని, అదే మగ్గం మీద నేసిన చీర ఎంతో నాణ్యంగా ఉంటుందని, నేతన్న కష్టానికి ప్రజలంతా తమ సహకారం అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని అధికారులంతా తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించి రావాలన్నారు..