జిల్లాలో భారీ వర్షాలు,గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు-కలెక్టర్

సెలవులు అన్ని రద్దు..
నెల్లూరు: ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు,గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని,ఈలాంటి పరిస్థితిని ఎదుక్కొనేందుకు అధికారులు కార్యాయల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉండి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా నివారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటినుండే చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంతో సహా అన్ని మండల డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ విభాగాలను అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు తక్షణమే చేయాలన్నారు.
పునరావాసం కోసం తుఫాను షెల్టర్ లను సిద్ధం చేయాలన్నారు. అవసరమైనంత నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.భారీ వర్షాలకు దృష్ట్యా అధికారులకు ఇదివరకు ఇచ్చిన సెలవులన్నీ రద్దు చేశామని అందరూ అందుబాటులో ఉండాలన్నారు.వర్షపు నీరు సజావుగా వెళ్లడానికి అవసరమైతే చెరువు కట్టలను గండి కొట్టాలన్నారు.అన్ని జలాశయాలు,బ్యారేజీలు, చెరువుల వద్ద సిబ్బందిని 24 గంటలు పనిచేసే విధంగా నియమించాలన్నారు.
ఎక్కడైనా జాతీయ రహదారులు ఇతర రహదారులు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. సహాయక సామాగ్రిని తరలించేందుకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. రాకపోకలకు ఎక్కడైనా అంతరాయం కలిగితే తొలగించేందుకు జెసిబిలు,జనరేటర్లు,విద్యుత్ రంపాలు మొదలగు సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
వైద్య ఆరోగ్య సిబ్బంది తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం కోసం సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు 108, 104 అత్యవసర వాహనాలను అంబులెన్స్లను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హై రిస్కు కాన్పుల , ఎమర్జెన్సీ కేసులు చూసేందుకు మందులు, రక్తం కావలసినంత అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా అంతరాయం కలిగితే తక్షణమే స్పందించే విధంగా సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్లు పనిచేయనప్పుడు వాకి టాకీ సెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ప్రమాదాలు నివారించేందుకు కోసం SDRF,,NDRF బృందాలను ముందుగానే జిల్లాకు రప్పించాలన్నారు.