రీ సర్వేలో అనధికార స్థలాలు గుర్తించండి-కమిషనర్ హరిత

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకంలో భాగంగా నగర వ్యాప్తంగా జరగనున్న రీ సర్వేలో అనధికార స్థలాలు గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయం వార్డు ప్లానింగ్ & రెగులేషన్ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రీ సర్వే 4వ రోజు శిక్షణ తరగతులకు కమిషనర్ గురువారం హాజరై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న రీ సర్వే ప్రక్రియతో నగరంలోని అనధికార లే అవుట్లు, భవనాలను గుర్తించి కార్పొరేషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. L.R.S పధకం యజమానుల వివరాలను సంబంధిత అధికారులకు నివేదించడంతో పాటు అనుమతులు మంజూరులేని లేఅవుట్ల యజమానులకు అవసరమైన పత్రాలను సమర్పించి, దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోపు L.R.S పధకంలో అన్ని పాటర్న్స్, అప్లికేషన్ లను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు మార్జిన్ ఆక్రమణలు, ప్రకటనలు, అక్రమ నిర్మాణాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.