ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో స్వర్ణాల చెరువు ఘాట్ లో నిమజ్జనం-కాకాణి

నెల్లూరు: నగర వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ నుంచి జరుపుకోనున్న వినాయక చవితి ఉత్సవాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళిక బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో గణేష్ చతుర్థి, నిమజ్జన ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..మంత్రి మాట్లాడుతూ ప్రతీ ఏటా నిమజ్జనం నిర్వహించే పెన్నానది రంగనాయకుల పేట వద్ద కాకుండా ఈ ఏడాది ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో స్వర్ణాల చెరువు ఘాట్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. పండుగ నిర్వహణలో ఆసక్తి చూపే యువతకు ప్రోత్సాహంగా విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతులు మంజూరు చేయాలని సూచించారు..ఇళ్ల మధ్యలో ఉండే మండపాల వద్ద భారీ సౌండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకునేలా అనుమతులు ఇవ్వాలని తెలిపారు.మండపాల వద్ద, నిమజ్జనం ప్రదేశంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ వారు జాగ్రత్తలు వహించాలని మంత్రి సూచించారు. ఘాట్ రిపేరు పనులు, చెరువులో గుర్రపు డెక్క ఆకు తొలగింపు, రోడ్డు మార్గాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి 4 భారీ క్రేన్ లను వినియోగించాలని, రేపటి నుంచే నిమజ్జన ట్రయల్ రన్ పనులు ప్రారంభించాలని సూచించారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు నుడా, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ నిధులను వినియోగించనున్నామని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా నిధులు మంజూరు చేసేలా కోరుతామని తెలిపారు. నిమజ్జనం జరిగే రోజుల్లో స్వర్ణాల చెరువులో తగినంత నీటిని నిల్వ ఉంచేలా నీటి పారుదల శాఖ అధికారులు జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆదేశించారు.