లింగ నిర్దారణ పరీక్షలు చేస్తే,కఠిన చర్యలు-కలెక్టర్

నెల్లూరు: గర్భస్థ లింగ నిర్దారణ నేరమని, దీనికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రొప్రియెట్ అధారిటీ మీటింగ్ ఆన్ PC & PNDT చట్టం-1994, ART, సరోగసీ చట్టం అమలుపై కలెక్టర్, సంబంధిత కమిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న గర్భస్థ లింగనిర్దారణ పరీక్షలు, స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కలెక్టర్ ఆరా తీశారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని, రికార్డులను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లింగ నిర్ధారణ చేయాలని అడగడం కూడా చట్టవ్యతిరేకమేనని స్పష్టం చేశారు. వివిధ కారణాలవల్ల ఇటీవల కాలంలో సరోగసీ విధానం కూడా వ్యాప్తి చెందుతోందని, దీనిపైనా నిఘా ఉంచాలని సూచించారు. సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ గర్భస్థ లింగ నిర్ధారణ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు పూర్తి స్థాయిలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని, పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు కుటుంబ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్యాధికారులు, స్వచ్చంద సంస్థలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.