రామాయపట్నం పోర్టు నిర్వాసితులకుమౌలిక సదుపాయాలు-కరికాల వలెవన్

నెల్లూరు: రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, అధికారులను ఆదేశించారు. గురువారం కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రామాయపట్నం నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు, మౌలిక వసతులు, భూ సేకరణ ప్రక్రియపై కరికాల వలెవన్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి సమీక్షించారు. రామాయపట్నం పోర్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాలైన మొండివారిపాలెం, రావులవారిపాలెం, కర్లపాలెం, సాలిపేట గ్రామాలకు సంబంధించి చేపట్టాల్సిన ఆర్.ఆర్. ప్యాకేజీ పురోగతి, భూ సేకరణ ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు. రామాయపట్నం పోర్టు కు సంబంధించి మొదటి ఫేజ్ లో చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, అలాగే పోర్టు నిర్వాసితులకు చేపట్టాల్సిన పునరావాస పనులు త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ మీడియాతో మాట్లాడుతూ, రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు అన్ని వసతులతో ఆధునిక పునరావాస గ్రామాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీని వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ప్రత్యక్షంగా సుమారు 23 వేల మందికి, పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. పోర్టు అనుసంధానం గా చేపడుతున్న పరిశ్రమల్లో స్థానిక ప్రజలకు 75 శాతం మేర వారి యొక్క విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనతో పాటు రైలు, రోడ్డు, ఎయిర్ వే కనెక్టివిటీనీ అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.