ఇస్రో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం-తొలి ప్రవేట్ రాకెట్ ప్రయోగం

విజయవంతంగా నింగిలోకి విక్రమ్-ఎస్..
అమరావతి: తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి విజయవంతంగా చేరుకుంది. విక్రమ్- ఎస్ రాకెట్ 6 మీటర్లు పొడవు, 543 కిలోల బరువు కలిగి ఉంది. షార్ కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల మధ్య ఈ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్లుతో అంతరిక్షలోకి సాగింది. ప్రయోగ సమయం కేవలం 4 నిమిషాల 50 సెకండ్ల వ్యవధిలో భూ ఉపరితలం నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన స్కైరూట్ ఏరో స్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది.ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ మాట్లాడుతూ తొలి మిషన్‌కు ‘ప్రారంభ్’ అని నామకరణం చేసినట్లు తెలిపారు.విక్రమ్-స్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని, ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల్లో ఇది ఆరంభమేనని అన్నారు.వచ్చే సంవత్సరం ప్రయోగించబోతున్న విక్రమ్-1 ఆర్బిటాల్ వాహనంలో ఉపయోగించే 80% సాంకేతికతలను ధృవీకరించడంలో ఈ ప్రైవేటు రాకెట్ ఉపయోగపడనున్నది.ఈ ప్రయోగంను వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు.
2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగానికి అనుమతి లభించింది.అనుమతులు వచ్చిన వెంటనే స్కైరూట్ ఏరో స్పేస్ ఈ రాకెట్ ను రెండు సంవత్సరాల వ్యవధిలో,అతి తక్కువ ఖర్చుతో తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ ఇది వరకే తెలిపారు.ఈ రాకెట్ ప్రయోగం కోసం స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ దాదాపు రూ.408 కోట్ల రూపాయలను సమీకరించింది.భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికిన ప్రముఖశాస్త్రవేత్త డా.విక్రమ్ సారాభాయ్‌కి నివాళిగా స్కైరూట్ ఆయన పేరు పెట్టింది.