నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం

డిసెంబరు 1 నుంచి బ్రేక్ దర్శన..
తిరుమల: టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తామని టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12న తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు వీటిని తిరిగి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల రెండో సత్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏరోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లు అదే రోజు మంజూరు చేస్తామని, కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. ఈ కౌంటర్లలో కంప్యూటర్లు, కెమెరాలు, ఆధార్ నమోదు వ్యవస్థ, తాగునీరు, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.
డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు:- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని ఈఓ తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మాధవంలో గదుల బుకింగ్ అవకాశం:- శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈఓ తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్ లైన్ టికెట్లు కూడా మాధవంలోనే మంజూరు చేస్తామన్నారు.