కావ్య మన్యపు,మాలావత్ పూర్ణలను సన్మానించిన మెగాస్టార్

హైదరాబాద్: పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ, నాసా సైంటిస్ట్ కావ్య మన్యపులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.వారిని చిరంజీవి తన ఇంటికి పిలిపించుకుని వారిద్దరినీ సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్ లో పోస్టు చేశారు. వారు చేసిన ఘనతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అమ్మాయిలో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని, ఇద్దరు డైనమిక్ యువతులు కావ్య మన్యపు, పూర్ణా మాలావత్ లు నిరూపించారని ప్రశంసించారు.విద్య, చైతన్యం, సాధికారిత దిశగా అణగారిన వర్గాల బాలికలను నడిపించేందుకు ‘ప్రాజెక్టు శక్తి’ చేపట్టారని, వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు వెల్లడించారు.ఎవరూ ఎక్కలేని, లడక్ లోని 6 వేల అడుగులకు పైగా ఎత్తున్న పర్వతాన్ని మాలావత్ పూర్ణ, నాసా సైంటిస్ట్ కావ్య మన్యపులు అధిరోహించారు.100 మంది పేద బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడం కోసం ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరుతో పర్వతారోహణ వీరు మొదలుపెట్టారు.రూ.80 లక్షల దాకా నిధుల సేకరణే లక్ష్యంగా ఈ సాహసయాత్ర చేశారు.