బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ను అధికారికంగా ప్రకటించిన రాజు చార్లెస్ 3

అమరావతి: భారత సంతతికి చెందిన రిషి సునాక్(42)ను బ్రిటన్ ప్రధానిగా,రాజు చార్లెస్ 3 అధికారికంగా బ్రిటన్ ప్రధానిగా ప్రకటించారు. రిషికి ప్రధాని బాధ్యతలు అప్పగించిన విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కింగ్ చార్లెస్ 3 నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు రిషి వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సరికొత్త చరిత్రను లిఖించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన మొదటి లక్ష్యమని వెల్లడించారు.‘‘ బ్రిటన్ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తా. వారి శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమించి పనిచేస్తా. భవిష్యత్ తరాలు రుణ ఊబిలో ఉండకుండా చేస్తాను’’ అని ఆయన తెలిపారు. మాటలతో కాకుండా చేతల ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. లిజ్ ట్రస్ గతంలో ప్రధానిగా చేసిన తప్పులను సరిదిద్దుతానని రిషి తెలిపారు. లిజ్ తనదైన శైలిలో దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి తాపత్రయపడిందే తప్ప, మరో ఉద్దేశం ఆమెకు లేదని స్పష్టం చేశారు. అయితే ఆమె చేసిన కొన్ని తప్పులను సరిదిద్దేందుకే కన్జర్వేటివ్ పార్టీ తనకు ప్రధానిగా అవకాశం ఇచ్చిందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు.