శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. సంవత్సరంలో నాలుగు పర్వదినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.
ఆనందనిలయం:- ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.