స్వచ్ఛ నగరానికై ప్రతిఒక్కరూ సంకల్పిద్దాం- స్వచ్ఛతా లీగ్ ర్యాలీలో మేయర్, కమిషనర్

నెల్లూరు: నగరాన్ని పర్యావరణ హితమైన స్వచ్ఛతతో ఉంచేందుకు ప్రజలంతా సంకల్పించాలని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి, కమిషనర్ హరితలు ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తాధ్వర్యంలో “ఇండియన్ స్వచ్ఛతా లీగ్” ర్యాలీని శనివారం ఉదయం నిర్వహించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బారాషాహీద్ దర్గా ప్రాంగణం, ఘాట్ పరిసర ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ దేశ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన నగరానికి చెందిన పెంచల చైతన్యను మేయర్, కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, అన్ని విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.