ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థత-క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స

అమరావతి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా వుంది. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఉన్నారని.. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తుందని మేదాంత ఆసుపత్రి వైద్యులు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం కొద్దిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ములాయంసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేతాజీ గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ‘క్రిటికల్ కేర్ యూనిట్’లో చికిత్స పొందుతున్నారని సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది. పరిస్థితి నిలకడగా ఉందని,దయచేసి నేతాజీని కలిసేందుకు ఆసుపత్రికి రావద్దని,నేతాజీ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని పేర్కొంది.ములాయం కుమారుడు,సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.