నెల్లూరు జిల్లా విద్యాధికులకు పుట్టినిల్లి-జాయింట్ కలెక్టర్

మహర్షి వాల్మీకి జయంతి..
నెల్లూరు: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్(జె.సి) కూర్మనాథ్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంలో జె.సి మాట్లాడుతూ మనిషి తలచుకుంటే ఎటువంటి పరివర్తన చెందవచ్చునో వాల్మీకి మహర్షి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చన్నారు. కార్పొరేట్ సంస్కృతి లో కొట్టుమిట్టాడుతున్న నేటి భారతీయతను పరిరక్షించడానికి రామాయణ మహాకావ్యంలో తెలిపిన విధంగా నేటి సమాజం ఆచరించవలసిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి కష్టం ఎదురైనా నెరవేర్చవలసిన బాధ్యత ఉందని, ధర్మాన్ని పరిరక్షించడానికి అందరూ పాటుపడాలన్నారు. సమాజంలో ఎదుటివారితో ఎలా మెలగాలో తెలియజేసే అపురూప మహా కావ్యం రామాయణమని, రామాయణ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించటానికి ప్రయత్నించాలన్నారు. రామ అనే పదంలోనే అనేక అర్థాలు గోచరిస్తాయని తెలిపిన వక్తల అభిప్రాయంతో ఏకీభవిస్తూ నెల్లూరు జిల్లా విద్యాధికులకు పుట్టినిల్లని, అందరం కలసి జిల్లా అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత మహర్షి వాల్మీకి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగీత కళాశాల ఆధ్వర్యంలో కళా దీప్తి డాన్స్ అకాడమీ విద్యార్థినులు శుద్ధ బ్రహ్మ పరాక్రమ రామా అంటూ చేసిన నృత్య రూపకం ఆహుతులను ఆకట్టుకుంది.