విద్యా బుద్ధులు నేర్పే గురువుకి ఏ ఒక్కరూ సాటిరారు-కలెక్టర్

నెల్లూరు: విద్యా బుద్ధులు నేర్పే గురువుకి ఏ ఒక్కరూ సాటిరారని, విద్యార్ధులకు ఉత్తమ విద్యను అందించి ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థానానికి చేరుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో జరిగిన ఉత్తమ ఉపాద్యాయ పురస్కార ప్రదానోత్సవం-2022 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతీయ సమాజంలో గురువులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి విద్యార్ధికి విద్యతో పాటు దేశభక్తిని పెంపొందిస్తూ, మంచి ప్రవృత్తని ఇవ్వవలసిన బాధ్యత గురువులపై ఉందన్నారు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆజాదీ సే అంతోదయ తక్ కార్యక్రమం కింద జిల్లాకు జాతీయ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణమని, అన్నీ శాఖల సమిష్టి కృషి ఫలితమే అది సాద్యమైందని కలెక్టర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రమాణాలతో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండో విడత నాడు – నేడు కార్యక్రమం కింద 460 కోట్ల రూపాయలతో 1400 స్కూల్స్ లో మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.