DISTRICTS

నుడాఆధ్వర్యంలో నెల్లూరు నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ -చైర్మన్ ముక్కాల

నెల్లూరు: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆధ్వర్యంలో నెల్లూరు నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు నుడా కార్యాలయంలో అధారిటీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అజెండాలోని ఒక్కొక్క అంశాన్ని నుడా వైస్ చైర్మన్ ఓబులేసు నందన్ అధారిటీ కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి అధారిటీ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉందని, గత ఏడాదిగా కమిటీ సమావేశం జరగలేదని, ఇకనుంచి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నుడా అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించినట్లు చెప్పారు. నుడా పరిధిలో అనుమతులు లేని లే అవుట్లను ఇప్పటికే గుర్తించామని, వీటిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లేఅవుట్ల యజమానులు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా అప్రూవల్ మంజూరు చేస్తామని, లేఅవుట్లో ఎక్కువ స్థలం మౌలిక వసతులకు పోతుందని, కొంతమేర తగ్గించాలనే యజమానుల విజ్ఞప్తి మేరకు లే అవుట్ లో 40 అడుగుల రోడ్డుకు బదులుగా 30 అడుగుల రోడ్డు నిర్మించాలనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అనుమతితో ప్రభుత్వానికి నివేదిక పంపి అనుమతి కోరనున్నట్లు చెప్పారు. లేఅవుట్లకు సంబంధించి యజమానులకు నుడా ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తోందని, యజమానులు అందరూ తమ లేఅవుట్లకు తప్పనిసరిగా అనుమతులు తీసుకుని ప్లాట్లను విక్రయించాలన్నారు. జిల్లా ప్రజలు కూడా నుడా అనుమతులు ఉన్న లేఅవుట్లోనే ప్లాట్లు కొనుగోలు చేసి తమ బిడ్డలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేని ఆస్తిని అందించాలని ఆకాంక్షించారు. నెల్లూరు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై కూడా కమిటీ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పై, నుడా పరిధిలో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
నుడా వైస్ చైర్మన్ ఓబులేసు నందన్ మాట్లాడుతూ నుడా చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఒక వెబ్ సైట్ ను రూపొందిస్తున్నట్లు, నుడా పరిధిలో ఏ లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయి, లేవో ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఒక యాప్ ను తయారు చేయనున్నట్లు చెప్పారు. నుడా పరిధిలో చేపట్టనున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ సమక్షంలో కమిటీ సభ్యులకు వివరించినట్లు చెప్పారు. అజెండాలోని అంశాలపై కలెక్టర్, కమిటీ సభ్యులు సూచించిన సలహాలు, సూచనల మేరకు నుడా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ అథారిటీ కమిటీ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మారుతీ ప్రసాద్, పర్యాటక శాఖ అధికారి శ్రీ నాగభూషణం, విద్యుత్ శాఖ డిఈ కె సురేష్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *