ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలి-జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్

నెల్లూరు: ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్న వైద్యసేవల పట్ల గర్భిణులకు అవగాహన కల్పించి, సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ వైద్యాధికారులు, సీడీపీవోలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు, కోవిడ్ వ్యాక్సినేషన్, పౌష్టికాహారం పంపిణీ, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, సిడిపివోలతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు గర్భిణులను గుర్తించి, ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించి రక్తహీనత లేకుండా చూడాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, వారికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక యాప్ లో చిన్నారుల హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు. సిడిపివోలు, అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.ఈ సమావేశంలో DM&HO పెంచలయ్య,ICDS PD శ్రీమతి ఉమామహేశ్వరి,DCHS రమేష్ నాథ్,GGH సూపరింటెండెంట్ సిద్ధానాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ Dr.మురళీ కృష్ణ, జిల్లా మలేరియా అధికారి శ్రీమతి హుస్సేనమ్మ, వైద్యాధికారులు, CDPO, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.