దీపావళి సందర్బంగా అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం

అమరావతి: దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలుత రామ జన్మభూమిలోని రాంలాలా విరాజ్ మాన్ స్వామిని దర్శించుకున్నారు. రామజన్మభూమి ట్రస్టు సభ్యులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చిన మోడీ,, ప్రతిష్టాత్మకమైన భగవాన్ శ్రీరాముని రాజ్యాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం సరయూ నదీ తీరంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. నదీ తీరంలో దాదాపు 18 లక్షల మట్టి ప్రమిదలను వాలంటీర్లు వెలిగించారు. బాణాసంచా, లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యోగి ప్రభుత్వం మెగా ‘దీపోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది. 2020లో సరయూ నది ఒడ్డున 5.84 లక్షల దీపాలు వెలిగించగా,, 2021లో 9 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించడంతో అయోధ్య ప్రపంచ రికార్డు సృష్టించింది.నేడు 18 లక్షల దీపాలతో శ్రీరాముడి నడయాడిన నేలలో వెలుగులతో నిండిపొయింది.