AMARAVATHIDISTRICTS

ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌,8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు-కలెక్టర్

విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవు..
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు వెయ్యి మంది సిబ్బందిని కౌంటింగ్‌ విధులకు కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ తెలిపారు. జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సుమారు 1000 మంది సిబ్బందిని కౌటింగ్‌ విధులకు కేటాయించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అందరూ కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు, 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్‌ బూత్‌లు, అత్యల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 248 పోలింగ్‌ బూత్‌లు ఉన్నట్లు కలెక్టరు చెప్పారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చామని, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించడానికి నలుగురు అబ్జర్వర్లను ఎన్నికల సంఘం నియమించిందని, అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. అబ్జర్వర్‌ సంతకం చేసిన తర్వాత మాత్రమే రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రంపై డ్రోన్లు ఎగరకుండా రెడ్‌జోన్‌గా ప్రకటించామని, స్టేట్‌, ఆర్మ్‌డ్‌, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 130 నుంచి 140 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. ఇటీవల పోలింగ్‌ సమయంలో గొడవలు జరిగిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, పోలీసులు కార్టన్‌సెర్చ్‌ కూడా నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించారన్నారు. వాహనాలు, ఆయుధాలు గుర్తించి పోలీసులు సీజ్‌ చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతులు లేవని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ చెప్పారు. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *