పట్టభద్రుల, ఉపాధ్యాయుల MLC ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారీ-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లు, ఓటర్ల జాబితా రిజిస్ట్రేషన్ అధికారుల(EROల)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల క్లేయిములు, అభ్యంతరాల దరఖాస్తుల స్థితిగతులు, ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం, ఓటర్లు- జనాభా నిష్పత్తి,స్త్రీ- పురుష నిష్పత్తి విశ్లేషణ, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ, జాతీయ ఓటర్ల దినోత్సవం తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతి సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే అక్టోబర్ ఒకటో తేదీన పబ్లిక్ నోటీసు ఇవ్వడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు ఓటర్ కార్డుకు ఆధార్ సంఖ్య 43 శాతం అనుసంధానం చేయడం జరిగిందని, మిగిలినవి కూడా పూర్తి చేయుటకు రెండు వారాలపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఓటర్లు-జనాభా నిష్పత్తి నెల్లూరు సిటీ, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లో తక్కువగా ఉందని ఈ ప్రాంతాల్లో యువతపై ప్రత్యేక దృష్టి సారించి యువ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ-పురుష నిష్పత్తి 986 కాగా కొవ్వూరు, నెల్లూరు గ్రామీణ, కావలి నియోజకవర్గాల్లో అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి ఉందని వివరించారు.