G20 కూటమి సారధ్య బాధ్యతల స్వీకరించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంపచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్న G20 దేశాల కూటమికి నేటి నుంచి భారతదేశం నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా ఇందుకు సంబంధించిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. G20 సారధ్య బాధ్యతల బదలాయింపునకు సూచికగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో వుడెన్ హెమర్ (కర్ర సుత్తె)ను మోడీ చేతికి అందించి అభినందనలు తెలిపారు. G20 సారధ్య బాధ్యతలు భారత్ అందుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన ఆంశం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతకుముందు G20 సదస్సులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాన చర్చ జరిగింది.ఐరోపా దేశం పోలాండ్ లో జరిగిన మిస్సైల్ దాడిలో ఇద్దరు మృతిచెందిన సంఘటనపైనా చర్చ జరిగింది. మిస్సైల్ దాడి చేసింది రష్యానే అని,,ఆ మిస్సైల్ రష్యాలో తయారైందేనని పోలాండ్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కేంద్రంగా ఈ చర్చ సాగింది. మరోవైపు G20 వేదికగా వివిధ దేశాల అధినేతలతోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మోడీ కలిసిన దేశాధినేతల జాబితాలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కూడా ఉన్నారు. గల్వాన్ లోయ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ ఘటన తర్వాత భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. G20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరయ్యారు.